భారత నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం తుదిమెరుగుల దశలో ఉన్న కొత్త పార్లమెంటు భవనాన్ని ఈనెల 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ఈ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. కొత్త పార్లమెంట్ భవనం భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని ఆకాంక్షించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. గురువారం ప్రధాని మోదీతో సమావేశమై నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఆహ్వానించినట్లు తెలిపింది.
పుష్ప అలంకరణ సహా ఇతర డెకరేషన్ పనుల కోసం రూ.14 లక్షలకు టెండర్లు సైతం పిలిచినట్లు వివరించింది. “పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం దాదాపు పూర్తైంది. కేంద్ర గృహ, పట్టణ శాఖ కార్యదర్శి మనోజ్ జోషీ, సీపీడబ్ల్యూడీ డీజీ శైలేంద్ర శర్మ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఇతర ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారు” అని అధికార వర్గాలు వెల్లడించాయి.