త్వరలో ఇటలీకి మోదీ.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటన

-

భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ వారం మోదీ తన తొలి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇటలీలో జరగనున్న జీ7 అధునాతన ఆర్థికవ్యవస్థల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరుకానున్నాయి. అపూలియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియాలో గల ఓ రిసార్టులో ఈనెల 13 – 15 తేదీల మధ్య ఈ సమావేశం జరగనుంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, గాజా సంఘర్షణ ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.

అమెరికా, ఫ్రెంచ్‌ అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయేల్‌ మెక్రాన్‌లతోపాటు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తదితర అగ్రనేతలు హాజరవుతారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఒక సెషన్‌కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడిపై చర్చలో పాల్గొంటారు. మోదీ ఇటలీ పర్యటనపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఆయన 13న బయలుదేరి, 14వ తేదీ రాత్రికి మళ్లీ భారత్‌కు చేరుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానితోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా, జాతీయ భద్రతాధికారి (ఎన్‌ఎస్‌ఏ) అజీత్‌ డోభాల్‌లతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇటలీ వెళుతున్నట్లు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news