ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ అభివృద్ధిలో మరో మైలురాయికి చేరుకుందని అన్నారు. యువత ఎక్కువగా స్టార్టప్ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పాలసీ వల్ల కాలుష్య భరితమైన వాహనాలను నెమ్మదిగా తొలగించడం జరుగుతుందని, దీంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు.
గుజరాత్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో భాగంగా మోదీ ఈ పాలసీని ప్రారంభించగా ఆయన పలు ట్వీట్లు కూడా చేశారు. వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద పాత వాహనాలను వాడేవారిపై జరిమానాలు వేస్తారు. వారు ధ్రువ పత్రాలను పొందడం కూడా కష్టతరమవుతుంది. కానీ వారు వాటిని స్క్రాప్ కింద వేసి కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే సబ్సిడీ ఇస్తారు.
కాగా వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన ప్యాసింజర్ వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్ కింద వేయాలి. అలా చేయకుండా వాటిని అలాగే కొనసాగిస్తే భారీ ఎత్తున జరిమానాలు విధిస్తారు. వాహనాల కండిషన్ బాగుంటే ఓకే. లేదంటే పెద్ద ఎత్తున జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని గట్టిగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ వాహనాలను కొనేవారికి సబ్సిడీలను కూడా అందిస్తోంది. కానీ పాత వాహనాలను వాడేవారిపై మాత్రం కొరడా ఝులిపించనున్నారు.