భారత ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చకచకా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 6గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సహా ప్రమాణం చేసే అవకాశముంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్‌సభ సంఖ్యాబలంలో 15% ప్రస్తుతం 81 మందిని మంత్రులుగా తీసుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి సొంతంగా లేదు కాబట్టి మిత్రపక్షాలకు ఈసారి ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు మోదీ మంత్రి పదవులు కేటాయిస్తారా? లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
గత రెండు పర్యాయాలు మిత్రపక్షాలకు పౌర విమానయానం, ఉక్కు, ఆహారశుద్ధి, భారీ పరిశ్రమల వంటి శాఖలనే బీజేపీ కేటాయించింది. టాప్-4గా చెప్పుకొనే హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేంద్రమంత్రివర్గం కొత్తవారితో సరికొత్త రూపు సంతరించుకొనే అవకాశముంది.
మరోవైపు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితర బీజేపీ అగ్రనేతలు దిల్లీలో గురువారం తమ పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఇంట్లో సమావేశమయ్యారు. మిత్రపక్షాలకు కేంద్ర మంత్రి పదవుల పంపకంపై సమాలోచనలు జరిపారు. స్వపక్షంలో ఎవరెవరిని కేబినెట్‌లోకి తీసుకోవాలన్నదానిపై చర్చించారు.