దిల్లీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిన్నారులు చనిపోవటం మనసును కలిచివేసిందని అన్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి కావాల్సిన మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఏం జరిగిందంటే..?
దిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో బేబీ కేర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 16 అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 12 మంది శిశువులను రక్షించాయి. రక్షించిన 12 మంది శిశువుల్లో ఒక పసికందు విషమపరిస్థితుల్లో ప్రాణాల కోసం పోరాడుతోంది. మరో ఐదుగురు చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. శనివారం రాత్రి పదకొండున్నర సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రపంచాన్ని చూసిన కొన్ని గంటల్లోనే పసికందులు ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.