డీప్‌ఫేక్‌తో నా గొంతునూ అనుకరించారు : మోదీ

-

టెక్నాలజీ.. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డీప్‌ఫేక్‌ వల్ల చాలా మంది చిక్కుల్లో పడుతున్నారని అన్నారు. డీప్ ఫేక్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని తెలిపారు. చివరకు తన గొంతును కూడా డీప్ ఫేక్తో అనుకరించారని మోదీ వెల్లడించారు.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌తో దిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రధాని చాయ్‌ పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పేమెంట్స్, వాతావరణ మార్పులు వంటి అనేక అంశాలపై ఇరువురు చర్చించారు. ఆధునిక సాంకేతికత, ప్రజల మధ్య అంతరాన్ని సూచించే డిజిటల్ విభజనను తాను అనుమతించనని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు.

మోదీ మాట్లాడిన దానికి బిల్‌గేట్స్ బదులిస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మనం ప్రారంభ దశలో ఉన్నామని అన్నారు. ఏఐ మనం కష్టం అనుకున్నవి సులువుగా చేస్తుందని, తేలికని భావించే వాటిలో విఫలమవుతోందని తెలిపారు. కృత్రిమ మేధ అనేది పెద్ద అవకాశం కానీ దాంతో కొన్ని సవాళ్లూ ఉన్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news