కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం ఇవ్వనున్నారు. ఇవాళ షురూ కానున్న ఈ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. గురువారం రోజున తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత సమావేశాల్లో ఘటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పార్లమెంటు పరిసరాల్లో సీఐఎస్‌ఎఫ్ బలగాల మోహరించి. తనిఖీలు చేస్తున్నారు.
పార్లమెంటు సమావేశాల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. శాంతి పరిరక్షణలో నారీ శక్తి కీలకంగా మారిందని ఆయన అన్నారు. నారీ శక్తిని కేంద్ర ప్రభుత్వం ప్రతిబింబిస్తుందని తెలిపారు. జనవరి 26వ తేదీన కర్తవ్యపథ్‌లో నారీ శక్తి ఇనుమడించిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల గురించి మాట్లాడుతూ ఇవి చివరి సమావేశాలని, ఈ సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని కోరారు. సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు క్షమించరని ప్రధాని మోదీ అన్నారు.