బ్రిటన్ రాజు ఛార్లెస్-3తో ప్రధాని మోదీ మంగళవారం ఫోన్లో మాట్లాడినట్లు పీఎంఓ వెల్లడించింది. ఈ ఫోన్‌కాల్ సంభాషణలో వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ తదితర విషయాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపింది. జీ20కి భారత్ అధ్యక్షత, మిషన్ లైఫ్ తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు పేర్కొంది. బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 నియమితులైన అనంతరం.. ప్రధాని మోదీ ఆయనతో మాట్లాడటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా చార్లెస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘కామన్వెల్త్ దేశాలు, వాటి మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, బ్రిటన్‌ల మధ్య ‘జీవన వారధి’గా.. ద్వైపాక్షిక సంబంధాలను సుసంపన్నం చేయడంలో బ్రిటన్‌లోని భారతీయ సమాజం పాత్రను కూడా ప్రశంసించారు’ అని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.