విపక్షాలు చాలాకాలం విపక్షంలోనే ఉండాలని సంకల్పించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నందున దశాబ్దాల తరబడి విపక్షంలో ఉండాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి కోరికను భగవంతుడు నెరవేరుస్తారని భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి వివరించారని అన్నారు.
“ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారు. ఎన్నికల్లో ఓటమి కోసమే విపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. విపక్షాల తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలో విపక్షాలకు తెలియడం లేదు. మైనారిటీల పేరిట ఎంతకాలం రాజకీయాలు చేస్తారు? మైనారిటీలు అంటే ఎవరు.. మహిళలు మైనారిటీలు కారా.. రైతులు మైనారిటీలు కారా..? ఎంతకాలం విభజన రాజకీయాలు చేస్తారు? విపక్షాల తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందారు.” అని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల తీరుపై మండిపడ్డారు.