మణిపుర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్రంగా కలిచి వేసింది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రతిపక్షాలు సహా ఇతర ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.
మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న జరిగితే.. 77 రోజుల తర్వాత ప్రధాని స్పందించడం విడ్డూరంగా ఉందని ప్రియాంక అన్నారు. ఆ దారుణం గురించి ఇప్పటి వరకు తెలియలేదా? అని ఆమె ప్రశ్నించారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా సొంతనియోజక వర్గం గ్వాలియర్‌లో ఆమె పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లో అధికార మార్పిడి తథ్యమని అన్నారు. బీజేపీని ఇంటికి పంపేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.