భారత రెజ్లింగ్ సమాఖ్యఅధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. వీరికి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా మద్దతు తెలిపారు. ఇవాళ ఉదయం ప్రియాంక రెజ్లర్లకు సంఘీభావం పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్.. ప్రియాంకకు తమ సమస్యలను వివరించారు.
‘‘బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇంతవరకూ ఆ కాపీలను బయటకు చూపించలేదు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఎఫ్‌ఐఆర్ కాపీలను ఎందుకు బయటపెట్టట్లేదు?ఈ రెజ్లర్లు పతకాలు గెలిచినప్పుడు మనమంతా ట్విటర్‌లో పోస్ట్ చేసి గర్వపడ్డాం. ఇప్పుడు అదే క్రీడాకారులు న్యాయం కోసం రోడ్డెక్కారు. మహిళా రెజ్లర్లంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరో గత్యంతరం లేక ఇలా గొంతెత్తారు. కానీ, ప్రభుత్వం మాత్రం వీరి ఆవేదనను వినకుండా బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తోంది?వీరి సమస్యను ప్రధాని మోదీ పరిష్కరిస్తారన్న నమ్మకం లేదు. ఒకవేళ వీరి గురించి ఆయన ఆందోళన చెంది ఉంటే.. ఇంతవరకూ రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు?కనీసం వీరిని కలవడానికి కూడా ప్రయత్నించలేదు’’ అని ప్రియాంక దుయ్యబట్టారు.