ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భారత్‌లో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. అయితే విదేశాల్లోనూ ఆయనకు సూపర్ పాపులారిటీ ఉంది. కేవలం ఎన్ఆర్ఐలు మాత్రమే కాదు విదేశీయులు, ప్రపంచ దేశాల అధ్యక్షులకు మోదీ ఫేవరెట్ పీఎం అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మోదీ పర్సనల్ ఫేవరెట్. ఈ విషయాన్ని ఇప్పటికే పుతిన్ చాలా సార్లు రుజువు చేశారు. ఇప్పటికే పలుమార్లు మోదీ నాయకత్వాన్ని కీర్తించిన పుతిన్.. తాజాగా మరోసారి ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు.
మోదీ నాయకత్వంలోని భారత్ అభివృద్ధిలో గొప్ప ప్రగతిని సాధిస్తోందని పుతిన్ కొనియాడారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం- EEFలో పాల్గొన్న పుతిన్ మోదీ నాయకత్వంలో భారత్ సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని ఆయన అభినందించారు. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు… 2014లో ప్రధాని ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియాను పుతిన్ మెచ్చుకొన్నారు.
దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భారత్ అనుసరిస్తున్న విధానాన్ని చూసిరష్యా ఎంతో నేర్చుకోవాలని పుతిన్ పేర్కొన్నారు. ప్రధానితో… తనకు చాలా మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయన్నారు. ఇదే అజెండాతో ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారత్ వంటి మిత్ర దేశాలు అనుసరిస్తున్న విధానాలను రష్యా కూడా అనుసరించాలనుకుంటోందని పుతిన్ వెల్లడించారు.