ఆమ్ ఆద్మీపార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఓ వివాదంలో చిక్కుకున్నారు. దిల్లీ సర్వీసుల బిల్లుకు సంబంధించిన ప్రతిపాదనపై తమ సంతకాలను తమకే తెలియకుండా ఫోర్జరీ చేసి సెలక్ట్ కమిటీకి పంపించారని ఐదుగురు ఎంపీలు ఆరోపించారు. బీజేపీకి చెందిన ఒక ఎంపీతో సహా మొత్తం ఐదుగురు ఎంపీలు రాఘవ్ చద్దాకు వ్యతిరేకంగా ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.
ఈ క్రమంలో.. ఎంపీల ఫిర్యాదుపై విచారణ జరుపుతామని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రకటించారు. దీనిపై కేంద్రహోం మంత్రి అమిత్‌షా స్పందించారు. రాజ్యసభ ప్రత్యేక హక్కులను రాఘవ్ చద్దా ఉల్లంఘించడంతో ఈ విషయాన్ని ప్రివిలేజెస్ కమిటీకి పంపించాలని అన్నారు. దీనిపై ఆప్ స్పందించింది. సెలక్ట్ కమిటీకి ప్రతిపాదనను పంపించాలంటే నిబంధనల ప్రకారం ఎంపీల సంతకాలు అవసరం లేదని పేర్కొంది. సంతకాలే అవసరం లేనందున.. ఫోర్జరీ ఆరోపణలు అనవసరమని స్పష్టం చేసింది. ప్రివిలేజెస్ కమిటీ తనకు నోటీసులు ఇచ్చినప్పుడు తాను సమాధానమిస్తానని రాఘవ్ చద్దా తెలిపారు.