దేశాన్ని విభజించి రక్తపాతం సృష్టించాలనుకుంటున్న రాహుల్ గాంధీకి పాక్ మాజీ అధ్యక్షుడు జిన్నా మైండ్ సెట్ ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ అమెరికాలో తాజా వ్యాఖ్యలు చేశారు.‘భారత్‌లో రాహుల్ సిక్కుల గురించి మాట్లాడరు. ఎవరి హయాంలో ఎందుకు వారిపై ఊచకోత జరిగిందో ఆయన అంతర్మథనం చేసుకోవాలి. కోరుకున్నది దక్కాలి లేదా నాశనమవ్వాలన్న జిన్నా వైఖరే ఆయనకు ఉంది. ఓ పద్ధతి ప్రకారం సిక్కులపై కుటిల యత్నానికి పాల్పడుతున్నారు’ అని కేంద్రమంత్రి విమర్శించారు.
ఇదిలాఉండగా, ఇటీవల రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్భంగా సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలను పలు సంఘాల నేతలు ఇప్పటికే తప్పుబట్టారు.మరికొందరు ఆయన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. రాహుల్ విదేశాలకు ఎప్పుడు వెళ్లిన దేశం పరువు తీయడమే ఎజెండాగా పెట్టుకుంటారని, దేశం విలువను ఆయన ఎప్పటికీ తెలుసుకోలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ఇప్పటికే పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే.