ఎన్సీపీ చీలిక వెనక ఆ పార్టీ అధినేత శరద్ పవార్ హస్తం ఉందని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. శరద్ పవార్ పై రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అజిత్ పవార్‌తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారని, ఇది చాలా అసహ్యంగా ఉందని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. అజిత్ పవార్‌తోపాటు ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే, పాటిల్, చగన్ భుజ్‌భల్ వంటి సీనియర్ నేతలు శరద్ పవార్ ఆశీస్సుల్లేకుండా ముందుకెళ్లరని అన్నారు. అందుకే దీనివెనక శరద్ పవార్ హస్తం ఉందని తాననుకుంటున్నానని చెప్పారు.
`మహారాష్ట్రలో ఇటువంటి పద్దతులకు శ్రీకారం చుట్టిందే శరద్ పవార్. 1978లో నాటి వసంతదాదా పాటిల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పవార్ చీల్చారు. పురోగామి లోక్‌సాహి దల్ ప్రభుత్వానికి తొలిసారి శరద్ పవార్ మద్దతు తెలిపారు. అంతకుముందు ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. పవార్‌తో మొదలైన ఈ కార్యక్రమాలు పవార్‌తోనే ముగిశాయి` అని రాజ్‌ఠాక్రే వ్యాఖ్యానించారు.