దేశం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ సైనికులకు తన మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని.. పౌరులు కూడా సైనికులకు మద్దతుగా నిలవాలని కోరారు. భారత్ తన గౌరవాన్ని కాపాడుకునేందుకు నియంత్రణ రేఖను దాటేందుకు సిద్ధంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.. అటువంటి పరిస్థితిలో సైనికులకు మద్దతు ఇవ్వడానికి దేశ పౌరులు సిద్ధంగా ఉండాలని కోరారు.
భారత్‌కు పాకిస్థాన్ వెన్నుపోటు పొడిచిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చి కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు సెల్యూట్ చేశారు. యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా.. భారత ప్రజలు సైనికులకు మద్దతు ఇచ్చారని.. కానీ ఆ మద్దతు పరోక్షంగా ఉందన్నారు. అవసరమైతే యుద్ధ రంగంలో నేరుగా సైనికులకు మద్దతు ఇవ్వడానికి పౌరులు సిద్ధంగా ఉండాలని రాజ్‌నాథ్ సూచించారు. దేశ గౌరవాన్ని కాపాడుకోవడం నియంత్రణ రేఖను దాటడానికి భారత్ సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు. అంతకుముందు.. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లద్ధాఖ్ ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద నివాళుర్పించారు.