ఇంట్లో పనిమనిషి పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు జీవిత ఖైదు పడింది. దీంతో పాటు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ.. బెంగుళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజాన హెగ్డే రేవణ్ణ ను దోషిగా పెంచిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నాడు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. ఆగస్టు 1 న తీర్పు ప్రకటించిన తరువాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలపించాడు.
న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరం వెక్కివెక్కి ఏడ్చాడు. కేఆర్ నగరకు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హోలేనరసీపుర ఠాణాలో ప్రజ్వన్ రేవణ్ణ పై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్ పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా.. తాజాగా జీవిత ఖైదు శిక్ష ఖరారైంది.