ట్విటర్​లో మోదీని ఫాలో అవుతున్న ఎలాన్ మస్క్.. దీని వెనుక మర్మం ఇదేనా..?

-

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్విటర్​లో.. టెస్లా అధినేత, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ఫాలో అవుతున్నారు. మస్క్ 195 మందిని అనుసరిస్తుండగా.. వీరిలో వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, కంపెనీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫాలో అవడం ప్రారంభించడంతో.. ప్రధాని మోదీని మస్క్‌ ఎందుకు ఫాలో అవుతున్నారు? అనే చర్చ నెట్టింట ప్రారంభమైంది.

ట్విటర్‌లో ప్రధాని మోదీని, మస్క్‌ ఫాలో అవుతుండటంతో భారత్‌కు టెస్లా పరిశ్రమను తీసుకొస్తున్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే 2015లో ప్రధాని మోదీ కాలిఫోర్నియాలోని టెస్లా ప్లాంట్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. బ్యాటరీ టెక్నాలజీ రైతులకు ఏ విధంగా సాయపడుతుందనే దాని గురించి మస్క్‌తో చర్చించినట్లు ప్రధాని మోదీ అప్పట్లో ట్వీట్‌ చేశారు. అయితే అప్పట్లోనే టెస్లా భారత్​కు వస్తుందని అందరూ భావించారు.

కానీ.. దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించేందుకు అనుమతినిస్తేనే.. దేశంలో తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని మస్క్‌ చెబుతుంటే.. చైనాలో తయారు చేసిన వాహనాలను భారత్‌లో విక్రయించాలనేది సరైన ప్రతిపాదన కాదని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. దీంతో టెస్లా కార్లు భారత్‌ ఎంట్రీపై ప్రతిష్టంభన నెలకొంది. తాజా చర్యతో మరోసారి భారత్‌లో టెస్లా కార్ల విక్రయాలపై చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version