బటర్ చికెన్, దాల్ మఖానీ వంటకాల కోసం రెండు రెస్టారెంట్లు కొట్టుకుంటున్నాయి. ఆ వంటకాలను కనిపెట్టింది మేమే అంటే మేమేనంటూ గత కొన్నాళ్లుగా దిల్లీలోని రెండు రెస్టారెంట్లు సిగపట్లు పడుతున్నాయి. మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల పంచాయితీ చివరకు దిల్లీ హైకోర్టుకు చేరింది. దీనిపై ఈ నెల 16వ తేదీన వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ నరులా నెల రోజుల్లోపు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ప్రతివాదిని ఆదేశించారు.
తమ గ్రూప్ వ్యవస్థాపకుడు, పాకశాస్త్ర నిపుణుడైన కుందల్ లాల్ గుజ్రాల్ వీటిని కనుగొన్నారని మోతీ మహల్ వాదించారు. తందూరి చికెన్ అమ్ముడు కాని సందర్భంలో వంటకం డ్రైగా మారుతుండటం చూసి బటర్ చికెన్‌ను కనుగొన్నారని పేర్కొన్నారు. మోతీ మహల్ వాదనను దర్యాగంజ్ తోసిపుచ్చింది. తమ సంస్థ వ్యవస్థాపకుడైన కుందన్ లాల్ జగ్గి ఈ వంటకాలను కనిపెట్టారని దర్యాగంజ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మే 29వ తేదీకి వాయిదా వేసింది.