శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరమంతా భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. అడుగడుగునా నిఘాతో అయోధ్య నగరం ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ పహారాలో ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలో దికి గస్తీ నిర్వహిస్తోంది. మరోవైపు పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలు కూడా మోహరించారు. నగరంలో డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
శనివారం సాయంత్రం నుంచే అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. జవనరి 23వ తేదీ వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుందని అధికారులు తెలిపారు. రామాలయ సముదాయానికి 5 కిలోమీటర్ల పరిధిలో వారణాసి, మధుర మాదిరిగానే బారికేడ్లు పెట్టి, ఆంక్షలు విధించారు. ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల వాహనాలు, స్థానికుల వాహనాలు, అనుమతి ఉన్నవాటిని మాత్రమే ఆదివారం, సోమవారం వరకూ అయోధ్య లో తిరిగేందుకు అనుమతించారు. మిగిలిన వాహనాలను అయోధ్య వెలుపలే ఆపేస్తున్నారు. ఈ మేరకు అయోధ్యకు దారితీసే ఐదు మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.