గతంలో ఆయన ఆర్మీ మేజర్. రిటైర్ అయ్యానని సైలెంట్ గా తన పని తాను చూసుకోలేదు. ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఏకంగా ఆ కష్టాలు వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఆ రిటైర్డ్ ఆర్మీ మేజర్ రాసిన లేఖ చదివి ప్రభుత్వం అవాక్కయింది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..
మహారాష్ట్రలోని పలు గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. గుంతలు పడిన మట్టి రోడ్లపైనే సైకిళ్లపై ప్రయాణం చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని వివరిస్తూ షెవ్‌గావ్ తహసీల్‌లోని సాల్వద్గావ్ నివాసి రిటైర్డ్ ఆర్మీ మేజర్ దత్తు భాప్కర్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు లేఖ రాశారు.
‘మా గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. గుంతలు, బురదతో నడవడం కష్టంగా ఉంది. అందుకే మా గ్రామానికి చేరుకునేందుకు హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. అలా చేస్తే ఎగిరిపోతూ గుంతలను దాటగలుగుతాం’ అని భాప్కర్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ కాపీని సీఎం షిండేతో పాటు అహ్మద్‌నగర్ సౌత్ ఎంపీ సుజయ్ విఖే, షెవ్‌గావ్-పథర్డి ఎమ్మెల్యే మోనికా రాజ్లే, అహ్మద్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్, షెవ్‌గావ్ తహసీల్దార్‌కు కూడా పంపారు.
ఈ లేఖ చూసి ప్రజాప్రతినిధులు, అధికారులు అవాక్కయ్యారు. గ్రామానికి రోడ్డు లేకపోతే హెలికాప్టర్ కొనుక్కోవడానికి గ్రాంట్ ఇవ్వడమా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాగైనా ఆ గ్రామానికి రోడ్డు వస్తే సంతోషమే కదా అని షెవ్‌గావ్ వాసులు అంటున్నారు. ప్రస్తుతం ఈ లేఖ మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.