సమాజంలో న్యాయవ్యవస్థను భ్రష్ఠు పట్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సుప్రీంకోర్డు, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు అన్నారు. కోర్టులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తూ తీర్పును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని ఆరోపిస్తూ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్కు 21 మంది జడ్జిలు లేఖ రాశారు. తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొన్ని వర్గాలు యత్నిస్తున్నాయని అన్నారు.
సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని జడ్జిలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అనైతికం అని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య విలువలకు హానికరమనీ, న్యాయవ్యవస్థ సమగ్రతను ఇవి దెబ్బతీస్తాయని తెలిపారు. కొందరికి అనుకూలంగా ఉండే న్యాయ నిర్ణయాలను ప్రశంసించడం, అలా లేని వాటిని తీవ్రంగా విమర్శించడం, న్యాయ సమీక్ష సారాంశాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. న్యాయపరమైన ఫలితాలను, తీర్పులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఆయా వర్గాలు అనుసరిస్తున్న వ్యూహాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. అనవసర ఒత్తిళ్లనుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రతను రక్షించాలని సీజేఐను కోరారు.