జేడీయూకు బలం ఉందా?.. బిహార్లో ఎవరిది పైచేయి?

-

బిహార్‌ సీఎంగా నీతీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించడంతో ఆయన ఆమోదించారు. ఆర్జేడీతో బంధం తెంచుకున్న నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సాయంత్రం కల్లా కొత్త సర్కార్ కొలువుదీరే అవకాశం ఉండటంతో అసెంబ్లీలో ఎవరికి ఎన్ని సీట్లున్నాయి? ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ, ఆర్జేడీల్లో ఎవరిది పైచేయో ఓసారి చూద్దాం.

243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాల్సి ఉంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని అతిపెద్ద ఆర్జేడీ పార్టీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు వారికి ఇంకా 43 మంది సభ్యులు కావాల్సి ఉంది. జేడీయూకు 45 మంది సభ్యులుండగా.. 78 మంది ఎమ్మెల్యేలతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీతో ఈ పార్టీ కలిస్తే వారి కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం లభిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య సరిపోతుంది. నలుగురు సభ్యులున్న హిందూస్థానీ ఆవామ్‌ మోర్చా (సెక్యులర్‌) కూడా బీజేపీకి మద్దతిస్తుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఢోకా ఉండదు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు నీతీశ్‌కు మద్దతిస్తుండటంతో ఆర్జేడీ మంత్రుల స్థానంలో బీజేపీ సభ్యులు ప్రమాణం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి ఆ కూటమికి 114 మంది సభ్యుల బలం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news