పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జమ్మూ-కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల పోరు మన సైనికుల శవాలపై జరిగింది. దీనిపై ఎలాంటి దర్యాప్తు జరగలేదు. ఈ ఘటనపై విచారణ జరిగిఉంటే అప్పటి హోం మంత్రి (రాజ్‌నాథ్‌సింగ్) రాజీనామా చేయాల్సి వచ్చేది. చాలా మంది అధికారులు జైలు పాలయ్యేవారు. చాలా వివాదాస్పదం అయ్యేది’’ అని రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా బన్సూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించారు.
ఉగ్రదాడి జరిగిన ఫిబ్రవరి 14, 2019న ప్రధానమంత్రి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్‌లో ఉన్నారని గుర్తు చేశారు. ‘‘మోదీ నేషనల్ పార్కు నుంచి బయటకు రాగానే నేను ఫోన్ చేశాను. మన పొరపాటు కారణంగా మన సైనికులు మరణించారని చెప్పారు. దీంతో ఆయన మౌనంగా ఉండాల్సిందిగా నాకు చెప్పారు’’ అని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.