అత్రంగీరే సీన్ రిపీట్.. పాయింట్ బ్లాక్​లో గన్ పెట్టి తాళి కట్టించారు

-

బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఓ పెళ్లి విచిత్రంగా జరిగింది. సాధారణంగా అమ్మాయిలను బలవంతంగా తీసుకువచ్చి పెళ్లి చేయడం చూశాం. కానీ ఇక్కడ అబ్బాయిని కిడ్నాప్ చేసి మరీ వివాహం జరిపించారు. ఇదంతా చూస్తుంటే ధనుశ్-సారా అలీఖాన్ నటించిన అత్రంగీరే సినిమా గుర్తొస్తోంది కదా. అచ్చం అలానే ఓ యువకుడిని కిడ్నాప్ చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి అమ్మాయి మెడలో తాళి కట్టించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైశాలి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగం సాధించిన యువకుడిని కిడ్నాప్‌ చేసి.. తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించాడు ఓ తండ్రి. బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో అర్హత సాధించిన గౌతమ్‌కుమార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం రోజున కొంతమంది గౌతమ్​ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లాడు.

విషయం తెలుసుకున్న గౌతమ్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేశ్ రాయ్ అనే వ్యక్తి తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలని గతంలో గౌతమ్​ను కోరాడని.. తిరస్కరించినందుకు దాడి కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రాజేశ్ రాయ్ ఇంటి వద్దకు వెళ్లగా అప్పటికే గౌతమ్​తో తన కుమార్తె పెళ్లి జరిపించాడు రాజేశ్. అనంతరం తన ఇంట్లోనే బంధించాడు. పోలీసులు వచ్చి వారిని విడిపించగా.. తుపాకీ ఎక్కుపెట్టి తనతో తాళి కట్టించారని గౌతమ్‌ పోలీసుల ఎదుట వాపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version