నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన శుక్రవారం రోజున ఓ సభలో పాల్గొన్నారు. శరద్ పవార్ ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా ఆయన వైపు ఓ మైక్రోఫోన్ దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మైక్రోఫోన్ పవార్కు తగలకముందే దాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ మైక్రోఫోన్ను ఓ విలేకరి పవార్వైపు విసిరినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
బారామతి లోక్‌సభ స్థానంలో ఎన్సీపీ (ఎస్‌పీ) తరఫున శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు పోటీగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. అయితే తన కుమార్తెకు మద్దతుగా పవార్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మైక్రోఫోన్ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. స్థానిక విలేకరికి ఎలాంటి దురుద్దేశాలు లేవంటూ క్లీన్‌చిట్ ఇచ్చారు. శరద్ పవార్ ఉపన్యాసాన్ని మరింత స్పష్టంగా రికార్డు చేయడం కోసం మైక్రోఫోన్‌ను ముందుకు విసిరాడని తెలిపారు.