కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి వద్దకు ఓ వ్యక్తి ఏకంగా తుపాకీతో వచ్చాడు. నడుము వద్ద తుపాకీ పెట్టుకొని ఆ వ్యక్తి సిద్ధరామయ్యకు పూలమాల వేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రతిపక్షాలు ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధరామయ్య సోమవారం బెంగుళూరులో పర్యటించి.. అక్కడి లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. విల్సన్ గార్డెన్ సమీపంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన, వాహనంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతుండగా.. సిద్ధాపుర్‌కు చెందిన రియాజ్ అహ్మద్ అనే ఓ కాంగ్రెస్ కార్యకర్త పూలదండ తీసుకొని సీఎం ఉన్న ప్రచార వాహనంపైకి ఎక్కాడు. అయితే సిద్ధరామయ్యకు పూలమాల వేసే సమయంలో అతడి నడుము భాగాన ఓ గన్ కనిపించింది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయి రియాజ్ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు.