రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్ట్ ప్రాంగణంలో ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఆయనతోపాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జ్యోతిష పండితుడు చిర్రావూరి విజయానంతశర్మ పంచాంగ శ్రవణం చెబుతున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. కొత్త లక్ష్యాలతో ఆధునిక అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధన, ఆవిష్కరణల ద్వారా సమాజం వేగంగా ముందుకెళ్తుందని అన్నారు. పంచాంగ శ్రవణ శాస్త్రీయతను అర్థం చేసుకుని ముందుకెళ్లాలన్న గవర్నర్.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని కొనియాడారు. దేశంలో ఎంత భిన్నత్వం ఉన్నా.. మన ఐక్యతకు ధర్మమే ప్రాతిపదిక అని తెలిపారు. తెలుగు భాష చాలా గొప్పదని, స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా యువతకు శిక్షణ, ఉపాధి కల్పన అద్భుతం అని ప్రశంసించారు.
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణభారతి ట్రస్ట్ అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మంచి వర్షాలు పడి రైతులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానన్న కిషన్ రెడ్డి ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులు ఏమీ జరగకుండా దేశం ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.