జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. వర్షం సృష్టించిన బీభత్సంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి ఆ ప్రాంతంలో భారీ వాన కురిసింది. ఏకధాటిగా పడిన వర్షానికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడటంతో రహదారులు బ్లాక్ అయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రాంబన్ జిల్లాలో శనివారం రాత్రి భారీ వాన కురిసింది. గ్యాప్ లేకుండా కురిసిన వర్షం వల్ల పలు ప్రాంతాల్లో వివిధ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ జిల్లాల్లో వర్షం వల్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఇక కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఇళ్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున రాళ్లు పడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు.