కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న విషయం విదితమే. అయితే మే 1వ తేదీ నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకాలను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినా కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే ఆ ఏజ్ గ్రూప్ వారికి టీకాలను వేస్తున్నారు. చాలా చోట్ల కోవిడ్ టీకాలకు కొరత ఏర్పడింది. దీంతో టీకాల పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా కొనసాగుతోంది. అయితే కోవిడ్ టీకాలను తీసుకున్న తరువాత కూడా కోవిడ్ బారిన పడతామా ? అని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. మరి ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే…
కోవిడ్ టీకాలు తీసుకున్న తరువాత కోవిడ్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ అందరికీ కోవిడ్ రాదు. కేవలం కొద్ది మంది మాత్రమే వైరస్ బారిన పడతారు. కోవిడ్ టీకాలను తీసుకున్న వారిలో కేవలం 0.03 నుంచి 0.04 శాతం మందికి మాత్రమే వైరస్ సోకుతుందని నిర్దారించారు. కానీ వైరస్ వచ్చినప్పటికీ అది తీవ్రతరం కావట్లేదని, కేవలం స్వల్ప, మధ్యస్థ లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని, వారు చికిత్స తీసుకోగానే తగ్గిపోతుందని అంటున్నారు.
అయితే కోవిడ్ టీకాలను తీసుకున్న తరువాత శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. వ్యక్తిని బట్టి ఈ సమయం మారుతుంది. రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉంటే యాంటీ బాడీలు త్వరగా ఉత్పత్తి అవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గితే యాంటీ బాడీలు ఏర్పడేందుకు సమయం పడుతుంది. కానీ ఆలోగా కోవిడ్ సోకే అవకాశాలు ఉంటాయి. కనుక టీకాలను తీసుకున్నవారు వైరస్ నుంచి 100 శాతం రక్షణ లభించిందని అనుకోవద్దని, వారు కూడా ఇతరుల్లాగే కోవిడ్ రాకుండా అన్ని జాగ్రత్తలను పాటించాలని చెబుతున్నారు.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కోవిడ్ టీకా అనంతరం శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడేందుకు సమయం పడుతుంది కనుక అప్పటి వరకు కోవిడ్ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలని, మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, సబ్బు లేదా హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్‌లతో చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించింది.