డ్రైవర్ లేకుండా గూడ్స్ రైలు పరుగులు ఘటన.. ఆరుగురిపై సస్పెన్షన్ వేటు

-

ఇటీవల జమ్మూ నుంచి పంజాబ్ వరకు డ్రైవర్ లేకుండా గూడ్స్ రైలు ప్రయాణించిన ఘటన గురించి తెలిసిందే. అయితే లోకో పైలట్‌, స్టేషన్‌ మాస్టర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తేల్చారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిని విచారించిన తర్వాత అధికారులు నివేదిక రూపొందించి పలు విషయాలు తెలియజేశారు. కథువా స్టేషన్‌లో నిలిపిన రైలుకు బ్రేక్‌ వ్యాన్‌ లేదని, జమ్ము స్టేషన్‌కు రైలును నడపమని కంట్రోల్‌ రూం తెలిపిన తర్వాత గార్డు కోచ్‌ లేదా బ్రేక్‌ వ్యాన్‌ లేదని లోకోపైలట్‌ జవాబు ఇచ్చాడని అధికారులు తెలిపారు. చేసేదేం లేక రైలును అక్కడే వదిలి విధుల నుంచి విరామం తీసుకోమని కంట్రోల్‌రూం తెలిపడంతో తాళం స్టేషన్‌మాస్టర్‌కు అందించి డ్రైవర్‌ వెళ్లిపోయాడని వెల్లడించారు.

ఈ క్రమంలో రిజిస్టర్‌లో సమాచారాన్ని పేర్కొనలేదని, సంతకమూ చేయలేదని చెప్పారు. రైలును మనిషి లేకుండా నిలిపి ఉంచే సమయంలో రైల్వే నిబంధనల ప్రకారం స్టేషన్‌మాస్టర్‌ లిఖిత పూర్వకంగా లోకోపైలట్‌కు అనుమతి రాసి ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అది కూడా ఇక్కడ జరగలేదన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం ఆరుగురు రైల్వే సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు చెప్పారు.

కథువా స్టేషన్‌లో రైలు ఇంజిన్‌, 3 వ్యాగన్లను ఆపేందుకు హ్యాండ్‌ బ్రేకులను అప్లై చేశానని, రైలు ముందుకు కదలకుండా చెక్కదుంగలను కూడా ట్రాకులపై అడ్డుపెట్టానని లోకోపైలట్‌ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ఉచ్చిబస్సి స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత తనిఖీ చేసిన అక్కడి స్టేషన్‌మాస్టర్‌, హ్యాండ్‌బ్రేకులు వేయలేదని గుర్తించారు. కథువా స్టేషన్‌మాస్టర్‌ కూడా రైలు ఆగిన తర్వాత బ్రేకులు వేశారో లేదో నిర్ధరించకుండా రైల్వే నిబంధనలను ఉల్లఘించారని నివేదిక పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version