మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీలో ఒకరికి బదులు మరో వ్యక్తి మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష రాసి ర్యాంక్ సాధిస్తాడు. కొన్నేళ్లుగా నీట్ పరీక్షల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా పేపర్ లీక్‌లో ‘సాల్వర్ గ్యాంగ్’ హస్తం ఉన్నట్లు బయటపడింది. బిహార్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో ఈ గ్యాంగ్ కీలక సభ్యుడు రవి అత్రి హస్తం ఉన్నట్లు సమాచారం. అతడి కనుసన్నల్లోనే నీట్ పేపర్ లీకైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
నీట్ పేపర్ లీక్ వెనక ఈ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ ముఠా ప్రశ్నపత్రాన్ని ముందుగానే చేజిక్కించుకోవడం.. దానికి సమాధానాలు తయారు చేసి.. వాటిని సోషల్ మీడియా ద్వారా కొనుగోలుదార్లకు పంపడంలో అందెవేసిన చెయ్యని గుర్తించారు. గతంలో కూడా వేర్వేరు రాష్ట్రాల్లోని పలు పరీక్ష పత్రాలను లీక్ చేసిన కేసుల్లో రవి అత్రి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాని.. అతడికి ఆయా ప్రాంతాల్లోని ఎగ్జామ్ మాఫియాతో బలమైన సంబంధాలున్నాయని తెలిపారు. ఈ సాల్వర్ గ్యాంగ్‌కు డబ్బులు చెల్లిస్తే అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీలను ప్రవేశపెట్టి పరీక్షలు రాయిస్తుందని.. కచ్చితంగా ర్యాంక్ వస్తుందన్న హామీ ఇచ్చి.. భారీగా సొమ్ములు తీసుకొని ఈ పనిచేస్తుందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.