వాహనదారులకే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఊరటనిచ్చే విషయం తెలియజేసింది. కొత్తగా BH నంబర్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. రక్షణ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, పీఎస్‌యూలు, ప్రైవేటు సెక్టార్ కంపెనీల ఉద్యోగులు ఈ సిరీస్‌లో తమ ప్రయివేటు వాహనాలను రిజిస్టర్ చేయించుకోవచ్చు.
ప్రైవేటు సెక్టార్ ఉద్యోగులు అయితే వారి సంస్థలకు చెందిన కార్యాలయాలు కనీసం 4 అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఉండాలి. ఇక BH సిరీస్‌లో వాహనాలను రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మళ్లీ రోడ్డు ట్యాక్స్‌ను భారీ మొత్తంలో చెల్లించాల్సిన పని ఉండదు. అలాగే వాహనాలను విక్రయించడం కూడా సులభతరం అవుతుంది.
గతంలో IN సిరీస్ పేరిట వాహనాలను రిజిస్టర్ చేసేందుకు సదరు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ BH సిరీస్‌ను ప్రవేశ పెట్టింది. BH అంటే భారత్ సిరీస్ అని అర్థం. ఇక ఇప్పటి వరకు వాహనదారులు కొత్త వాహనానికి 15 ఏళ్ల వరకు రోడ్డు ట్యాక్స్ ను చెల్లించాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తే అక్కడ కూడా మళ్లీ రోడ్డు ట్యాక్స్ ను చెల్లించాల్సి వస్తోంది. కానీ BH సిరీస్‌లో వాహనాన్ని రిజిస్టర్ చేస్తే ఏడాదికి ఒకసారి రోడ్డు ట్యాక్స్ ను చెల్లించాలి. దీని వల్ల వేరే రాష్ట్రాలకు వెళ్లే వారికి ఎక్కువ పన్ను కట్టే బాధ తప్పుతుంది.
BH సిరీస్ లో వాహనాన్ని రిజిస్టర్ చేస్తే వాహనం ధర రూ.10 లక్షల వరకు 8 శాతం పన్ను కట్టాలి. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల విలువ చేసే వాహనం అయితే 10 శాతం, రూ.20 లక్షల కన్నా ఎక్కువ విలువ ఉంటే వాహనానికి 12 శాతం రోడ్డు ట్యాక్స్ కట్టాలి. డీజిల్ వాహనాలకు మరో 2 శాతం అదనంగా ట్యాక్స్ విధిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలకు 2 శాతం తక్కువ పన్ను కడితే చాలు. ఏడాది తరువాత మళ్లీ ట్యాక్స్‌ను చెల్లించాలి. ఇలా 14 ఏళ్ల పాటు చెల్లించాలి. ఇక ఇంకో రాష్ట్రానికి తరలివెళ్లినా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అలాగే వాహనాన్ని ఇతర వ్యక్తులకు విక్రయించడ కూడా సులభతరం అవుతుంది.