దేశంలో ఏటా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని పార్లమెంటు స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన చెందింది. 2021లో రైతులు 10,881 మంది ఆత్మహత్య చేసుకుంటే, విద్యార్థులు 13,089 మంది చనిపోయారని పార్లమెంటు స్థాయీ సంఘం తెలిపింది. రైతుల ఆత్మహత్యలను జాతీయ సంక్షోభంగా అభివర్ణిస్తున్నప్పటికీ విద్యార్థుల మరణాలు మాత్రం ఎవ్వరి దృష్టినీ ఆకర్షించడంలేదని వాపోయింది. “గత అయిదేళ్లలో ఆత్మహత్యలు 26% పెరిగినట్లు తెలిపింది.
‘‘2021 నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 12 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో అత్యధికసంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉండటం తీవ్ర ఆందోళనకరం. యూపీఎస్‌సీ, సీఎస్‌ఈ, నీట్, ఎస్‌ఎస్‌సీ, జేఈఈ లాంటి అర్హత పరీక్షల్లో విఫలమైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి కేంద్ర వైద్యఆరోగ్యశాఖ 24/7 టెలిఫోన్ కౌన్సెలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంచాలి. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.’’ అని పార్లమెంటరీ స్థాయీ సంఘం శుక్రవారం లోక్‌సభకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.