సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24వ తేదీన ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఐదేళ్లపాటు సేవలందించిన ఆయన పదవీ విరమణ అనంతరం భోపాల్‌లోని జాతీయ జుడీషియల్ అకాడమీ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జస్టిస్ బోస్‌కు మంగళవారం రోజున సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మాట్లాడుతూ.. జస్టిస్ బోస్ అద్భుతమైన న్యాయమూర్తి అని, సిసలైన బెంగాలీ జెంటిల్‌మన్ (భద్రలోక్) అని, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా, ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన న్యాయ యవనికపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. జస్టిస్ బోస్ మంచి శ్రోత, మేధావి అని నిరంతర పఠనాసక్తి గలవారని తెలిపారు. ఆధునిక న్యాయ వ్యవస్థకు ఆయన మార్గదర్శి అన్న సీజేఐ సాంకేతిక ఆధారిత న్యాయ వ్యవస్థ కోసం ఆయన పని చేశారని చెప్పారు.