బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో దోషులను విడుదల చేసిన అంశంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సుప్రీం.. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష పెట్టడంపై వివరణ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
ఆగస్టు 15న బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. గుజరాత్ ప్రభుత్వ తీరును విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, దోషుల విడుదలపై వివరణ ఇవ్వాలని.. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ సర్కార్‌ను కోరింది. అలాగే ‘శిక్షా కాలం తగ్గింపు’ను పొందిన వ్యక్తుల్ని కూడా ఈ కేసులో కక్షిదారులుగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.