రాష్ట్రపతి పరిశీలన కోసం ఆయా రాష్ట్రాల గవర్నర్లు పంపించే బిల్లు అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపించే బిల్లులపై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి నిర్ణయానికి గడువు నిర్దేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. తమిళనాడు స్టేట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసులో జస్టిస్ జె.బి పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ తో కూడిన ధర్మాసనం సుధీర్ఘ విచారణ చేసి ఈ సూచన వెలువరించింది. అయితే బిల్లులపై ఆమోదం తెలపడానికి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలవ్యవధిని నిర్ణయించడం ఇదే తొలిసారి.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏప్రిల్ 8వ తేదీన తీర్పు చెప్పింది. ఈ తీర్పుకు సంబంధించి 415
పేజీల తీర్పు కాపీలను తాజాగా సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. ఈ తీర్పులో గవర్నర్లు
పంపించే బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయానికి కేవలం మూడు నెలలు మాత్రమే గడువు ఉంటుందని
ధర్మాసనం స్పష్టం చేసింది. బిల్లులపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అయితే అందుకు గల
కారణాలను రాష్ట్రాలకు తెలిపాలని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ సందేహాలను వీలైనంత త్వరగా నివృత్తం చేయాలని సూచించింది.