ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం.
దిల్లీ పోలీసు బృందం గురువారం మాలీవాల్ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా దాడి ఘటనను ఆమె పోలీసులకు వివరించారు. ‘‘సీఎం నివాసంలో బిభవ్ కుమార్ నాపై దాడికి దిగాడు. చెంపపై కొట్టి, కాలితో తన్నాడు. కర్ర తీసుకుని బాదాడు. కడుపుపైనే గాక సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా’’ అని స్వాతి పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
ఈ నెల 13న కేజ్రీవాల్ నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనిపై స్వాతి తొలిసారిగా స్పందించారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు.