మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తాడోబా అభయారణ్యంలో బుద్ధ పూర్ణిమ వేళ వన్య ప్రాణుల గణన చేపట్టారు. ఈ వివరాలను శనివారం (మే 25వ తేదీ) రోజున అధికారులు వెల్లడించారు. అభయారణ్యంలోని బఫర్ క్షేత్రంలో మొత్తం 79 మంచెలు ఏర్పాటు చేసి 180 మంది వన్యప్రాణి ప్రేమికులను నియమించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వన్య ప్రాణుల లెక్కను విడుదల చేశారు.
అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం..
తాడోబా అభయారణ్యంలోని బఫర్ జోన్‌లో 1,917, కోర్ క్షేత్రంలోని అయిదు జోన్లలో కలిపి మొత్తం 3,092 వన్యప్రాణులు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిలో 55 పులులు, 17 చిరుతలు, 1,458 జింకలు, 65 ఎలుగుబంట్లు 1,059 కోతులతో పాటు ఇతర జంతువులను గుర్తించినట్లు వెల్లడించారు. ఇంకా ఇవి కాకుండా లెక్కకు రాని మరిన్ని ప్రాణులు తిరుగుతున్నాయని అధికారులు ప్రకటించారు.