రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా రోజుకు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో మరో కొత్త నిబంధనతో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే కాకుండా.. ఒక్కోసారి బైక్పై వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ చేసే వ్యక్తి వెనక కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం వల్ల కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. అదేంటంటే..?
ఇకపై బైక్ డ్రైవింగ్ సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడడం శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నట్లు కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని.. పదే పదే రిపీట్ చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. రహదారి భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టినట్లు కేరళ సర్కార్ తెలిపింది.