భారత్‌లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడిన సంగతి తెలిసిందే. దీనికి తమిళ సినీ నిర్మాత ఏఆర్ జాఫర్ సాదిక్ సూత్రధారిగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. జాఫర్ సాదిక్ తమిళనాడులోని డీఎంకే పార్టీకి చెందిన వ్యక్తి. డ్రగ్స్ ఆరోపణలు రావడంతో అతడిని పార్టీ నుంచి తొలగించింది. జాఫర్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన ఆఫీస్ బేరర్ కాగా.. ఇటీవల బయటపడిన భారీ డ్రగ్ రాకెట్‌లో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు.
అతడు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి చెడ్డపేరు తీసుకొచ్చినట్లు పేర్కొన్న డీఎంకే.. అతడిని ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎన్‌ఆర్‌ఐ విభాగం పదవి నుంచి తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ వివరణ ఇవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై డిమాండ్ చేశారు.
దిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ద్వారా అంతర్జాతీయ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తమిళ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత జాఫర్ సాదిక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.