తమిళనాడు తంజావూర్ జిల్లా కలియమేడు లో ఆలయ వేడుకలకు సంబంధించి రథోత్సవం నిర్వహిస్తున్న సమయంలో రథంపై ఉన్న కరెంట్ వైర్లు తాకి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనం కాగా… చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం మరణించిన వారికి రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
తమిళనాడు తంజావూర్ లో జరిగిన ఈ ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతి పరిచింది. రథోత్సవం సందర్భంగా ఎలక్ట్రిక్ వైర్లు తగిలి రథానికి మంటలు అంటుకున్నాయి. దీంతో 11 మంది సజీవ దహనం కాగా.. చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.