ఇక క‌రోనా గుట్టు ర‌ట్టే.. భార‌త్ కీల‌క ముంద‌డుగు..

మాన‌వాళిని ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని మ‌రింత క‌చ్చిత‌త్వంతో అంచ‌నా వేసి, దానిని అంతం చేసే దిశ‌గా భార‌త్ కీల‌క ముంద‌డుగు వేసింది. ప‌రిశోధ‌కుల అంచ‌నాల‌కు దొర‌క్కుండా ముప్పుతిప్ప‌లు పెడుతున్న‌ క‌రోనా వైర‌స్‌కు ముకుతాడు వేసే దిశ‌గా భార‌త్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగానే.. కరోనా నిర్ధార‌ణ‌ పరీక్ష ఫలితాలను అత్యంత కచ్చితత్వంతో ఇచ్చే దేశీయ ‘సీఆర్‌ఐఎస్‌పీఆర్‌’ కొవిడ్‌-19 టెస్టుకు డీసీజీఐ( డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా) శనివారం అనుమతినిచ్చింది. ఈ మేరకు టాటా గ్రూప్ వివ‌రాలు వెల్ల‌డించింది.

ఈ ప‌రీక్షా ప్రక్రియను టాటా గ్రూప్‌, సీఎస్‌ఐఆర్( కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్ రీసెర్చ్‌) ‌-ఐజీఐబీ( ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బ‌యాల‌జీ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కరోనా వైరస్‌ ఉనికిని, జన్యు క్రమాన్ని అత్యంత కచ్చితత్వంతో తాము అభివృద్ధి చేసిన దేశీయ సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ సాంకేతికత సాయంతో కనుగొనవచ్చని టాటా గ్రూప్‌ ప్రతినిధులు తెలిపారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారిని నిలువ‌రించే ప్ర‌క్రియ‌లో భార‌త్ కీల‌క ముంద‌డుగు వేసిన‌ట్టేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెపుబుతున్నారు.