కేరళకు బాయిల్డ్ బియ్యం సరఫరా చేసే వ్యవహారంపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ యోచిస్తోంది. ఇది రాష్ట్రానికి ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని భావిస్తోంది. స్వర్ణ, విజేత రకాల బియ్యం ఏటా 20 కోట్ల కిలోలు (2 లక్షల టన్నులు) కావాలని రాష్ట్రాన్ని కేరళ కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై రెండు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు సమావేశమై చర్చించారు. త్వరలో తెలంగాణ, కేరళ పౌరసరఫరాల శాఖ కమిషనర్ల భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కేరళకు బియ్యం అందించేందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బియ్యానికి మూడు నెలల్లో డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. ముందు కొంత అడ్వాన్సు ఇవ్వాలని తెలిపింది.
రాష్ట్రంలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తుండగా ధాన్యం ధరను, కొనుగోలు ఖర్చుల్ని ఎఫ్‌సీఐ (కేంద్రం) భరిస్తోంది. పౌరసరఫరాల సంస్థ తొలుత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతులకు చెల్లిస్తుండగా తర్వాత ఎఫ్‌సీఐ నుంచి డబ్బులు వస్తున్నాయి. ధాన్యం సేకరణ, మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి బియ్యాన్ని ఇచ్చే ప్రక్రియలో చాలా ఆలస్యం అవుతుండగా బ్యాంకు రుణాలపై వడ్డీ భారీగా పెరుగుతుండటంతో కేరళకు బియ్యం విక్రయించడం మంచి డీల్ అవుతుందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది.