ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా త్వరలోనే ఇండియాలోకి అడుగుపెట్టనుంది. ఆ దిశగా టెస్లా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత్‌లో కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర సర్కార్‌తో చర్చలు ప్రారంభించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏటా 5 లక్షల విద్యుత్తు వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ తయారయ్యే కార్లను ఇండో-పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
భారత్‌లో విద్యుత్తు వాహనాల ప్రారంభ ధర 20లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై టెస్లా గానీ, కేంద్రం నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు. గత నెల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం మస్క్ మాట్లాడుతూ వీలైనంత త్వరగా భారత్‌లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సమావేశం తర్వాతే టెస్లా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు షురూ చేసినట్లు తెలిసింది.