తనని తాను ఆధ్యాత్మిక గురువుగా భగవత్ స్వరూపుడిగా చెప్పుకునే నిత్యానంద చనిపోయారన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం తనకు తానుగా ఈక్వెడార్ కు సమీపాన నిర్మించుకున్న కైలాస దేశాన సమాధి స్థితిలో ఉన్నారని ఆయనే వెల్లడించారు.ఇంకేం భక్తులు అక్కడికి వెళ్తే చాలు అన్ని కోరికలూ తీరి అన్ని వరాలూ అందుకోవడం ఖాయం. కనుక దేవుడ్ని అని చెప్పుకునే వారికి, దేవుడి ప్రతినిధులం అని చెప్పి మాయలు చేసి తెలిసీ తెలియని జ్ఞానంతో ఫిజిక్సు పాఠాలు చెప్పేవారికి మన దేశంలో లోటు లేదు కనుక వాళ్లను మనం ఏం చేయాలేం.
ఏం చేయాలనుకున్నా వాళ్లంతా ఎక్కడికో పారిపోతారు. ఆ మధ్య నిత్యానంద ప్రవచనాలు అన్నీ ఓ ప్రముఖ సంస్థ ప్రింట్ చేసి హాయిగా అమ్ముకుంది కూడా ! అంటే ఆ ప్రవచనాలకు అంత క్రేజ్ ఉంటే మరి ! ఆ మనిషికి ఇంకెంత క్రేజ్ ఉండాలి అందుకే ఆయన ఏకంగా తన కోసం ఓ దేశాన్ని ఓ కరెన్సీనీ అన్నింటినీ ప్రకటించుకుని, తనని తాను సర్వసత్తాక శక్తికి ప్రతినిధిగా ప్రకటించుకున్నారు. కనుక మనదేశంలో జరగేందుకు వీల్లేకపోతే పక్క దేశం పోయి అయినా అనుకున్నవి సాధించవచ్చు. పాలక పక్షాలను కమాండ్ చేయవచ్చు కూడా !
మనుషుల్లో అజ్ఞానం ఉంది. అక్షర జ్ఞానం ఉన్నా కూడా అజ్ఞానం కారణంగా ఎవ్వరూ ఎవ్వరినీ ఏం చేయలేం. కనుక ఆయన సమాధి నుంచి బయటకు రాగానే పరమాద్భుతాలు జరుగుతాయి. అంటే గాల్లో నుంచి ఏవేవో ఖరీదయిన ఆభరణాల సృష్టి,నోటి నుంచి శివలింగం తీయడం వంటి అద్భుతాలేవో జరుగుతాయి. పొరపాటున స్వామీజీ చనిపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస్ ఏమౌతుందో అని బెంగపడిపోకండి.. ఆ బ్యాంకూ ఆ కరెన్సీ ఎక్కడికీ వెళ్లవు. అవన్నీ అలానే ఉంటాయి. ఉండాలి కూడా !లేకపోతే నిత్యానంద స్వామి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించదు గాక శాంతించదు.
2019 నవంబర్ లో భారత్ ను వీడిన ఆయన త్వరలోనే భక్తుల ముందుకు వస్తానని మాత్రం చెబుతున్నారు. ఎన్నో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన తరువాత కాలంలో మూడో కంటికి తెలియకుండా దేశం విడిచి పారిపోయి ఓ కొత్త దేశాన్నే నిర్మించి ప్రకటించి తన దైన అనుగ్రహ భాషణం అక్కడి నుంచే చేశారు. ఏదేమయినా ఆయన బతికి ఉన్నారో లేదో కానీ ఆయన పేరిట ఉన్న ఎఫ్బీ అకౌంట్ మాత్రం బాగానే స్పందిస్తుంది. పుకార్లను నమ్మవద్దని చెప్పి వెళ్తుంది. కనుక చివరికి చెప్పొచ్చేదేంటంటే..ఆ స్వామీజీ బాగున్నాడు మీరేం బెంగెట్టేసుకోకండి !