జమిలి ఎన్నికలకు వెళ్తే భారీగా ఖర్చు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిందే. దీనివల్ల ప్రతి 15 ఏళ్లకు ఒకసారి కొత్త ఈవీఎంలను కొనాల్సి ఉంటుందని అందుకు 10 వేల కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేశారు. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఆలోచన చేస్తున్న కేంద్రం గతంలో ఎన్నికల సంఘానికి ప్రశ్నావళిని పంపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వాటికి ఈసీ సమాధానం పంపింది. ఇందులో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు వేర్వేరుగా ప్రతి పోలింగ్‌కు రెండుసెట్ల ఈవీఎంలు అవసరం అవుతాయని స్పష్టం చేసింది. ఈ లెక్కన జమిలి ఎన్నికలకు వెళ్లిన ప్రతి 15 ఏళ్లకు ఒకసారి కొత్త ఈవీఎంలు అవసరం అవుతాయని పేర్కొంటూ.. ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలంటే అదనపు పోలింగ్ కేంద్రాలు, భద్రతా సిబ్బంది, ఈవీఎంల స్టోరేజీ సదుపాయాలు, మరిన్ని వాహనాలు అవసరం అవుతాయని ఈసీ వెల్లడించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 2029 నుంచే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అయితే అందుకోసం రాజ్యాంగంలోని 5 అధికరణాలను సవరించాల్సి ఉంటుందని కేంద్రానికి స్పష్టం చేసింది.