ఉత్తరాఖండ్‌లో కొండచరియలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో పర్యాటకులకు అడుగడుగునా అంతరాయం కలిగిస్తున్నాయి. తాజాగా మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా కొండచరియలు విరిగిపడటంతో పితోరాగఢ్ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో 300 మంది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రయాణికుల రాకపోకల కోసం రెండు రోజుల తర్వాత ఈ రోడ్డును తెరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు అల్మోరా, చమోలీ, చంపావత్, దేహ్రాదూన్, హరిద్వార్, గర్వాల్, నైనిటాల్, రుద్రప్రయాగ, తెహ్రీ గర్వాల్, పితోరాగఢ్, ఉద్దమ్ సింగ్ నగర్, ఉత్తరకాశీ జల్లాల్లో తుపాన్,ఉరుములతో కూడిన వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. యాత్రికులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.
‘అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి. సురక్షిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయండి. యుమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చే ప్రయాణికులు వాతావరణ సూచన తర్వాతే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. వెంట రెయిన్ కవర్, గొడుగు, వెచ్చని వస్త్రాలు ఉంచుకోవాలి’అని అందులో పేర్కొన్నారు.