ఉత్తరాఖండ్‌లోని ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. హరిద్వార్ మానసాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మందిరం మెట్ల మార్గంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. షార్ట్‌సర్క్యూట్‌తో పరిగెత్తే క్రమంలో గందరగోళం ఏర్పడటంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన భక్తులను అంబులెన్సులలో ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
శ్రావణమాసం ప్రారంభం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో మెట్ల మార్గం వద్ద తొక్కిసలాటకు దారితీసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శ్రావణంలో హరిద్వార్‌లోని గంగా తీరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కన్వర్ యాత్రికులు సైతం గంగా నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకెళ్లేందుకు ఇక్కడకు వస్తారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. తొక్కిసలాటపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.