మొబైల్ యూజర్లకు అలర్ట్. నేటి నుంచి కొత్త సిమ్ కార్డు నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సిమ్ స్వాప్, రీప్లేస్‌మెంట్ మోసాలను అరికట్టడానికి ట్రాయ్ పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది. అయితే ఈ రూల్స్తో సిమ్ కార్డ్ మోసాలను చాలా వరకు అరికట్టవచ్చని ట్రాయ్ అధికారులు భావిస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం, ఒక వినియోగదారుడు తన సిమ్‌ను పోర్ట్ చేయాలనుకుంటే, మొదటగా దరఖాస్తును సమర్పించి ఆ తర్వాత కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సమాచారాన్ని ధ్రువీకరించడానికి తమ రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతి యూజర్లకు కొంత మేర అసౌకర్యాన్ని కలిగించినా వారి భద్రతను దృష్టిలో ఉంచుకునే దీన్ని అమలు చేస్తున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. పొరపాటున మన ఫోన్ పోయినా, లేదా ఎవరైనా దొంగిలించినా, ఎఫ్‌ఐఆర్ కాపీని అందిస్తే మనకు కొత్త సిమ్ కార్డ్ వచ్చేది. ఇవాళ్టి నుంచి అలాంటి సంఘటన ఏదైనా జరిగితే, కొత్త సిమ్ కోసం కనీసం 7 రోజుల పాటు వేచి ఉండాల్సిందే.